తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణలో ఈ నెల 31 వరకూ అమలులో ఉన్న లాక్ డౌన్, కర్ఫ్యూలను మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం, కేంద్రం నుంచి అందిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ప్రజలంతా నిబంధనలు పాటిస్తే, వైరస్ ను పారద్రోల వచ్చని ఆయన అన్నారు. తెలంగాణలో లాక్ డౌన్ సంపూర్ణంగా అమలవుతోందని వ్యాఖ్యానించిన ఆయన, ఇదే స్ఫూర్తిని మరో 20 రోజులు చూపాలని ప్రజలను కోరారు. కరోనా వైరస్ పై మంత్రులు, అధికారులతో సమీక్ష అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.తెలంగాణలో ఇప్పటికే 1,400 ఐసీయూ బెడ్స్, 11 వేలకు పైగా ఐసోలేషన్ బెడ్స్ సిద్ధంగా ఉన్నాయని, మరో 500 వెంటిలేటర్లకు ఆర్డర్ ఇచ్చామని, 12,400 మందికి క్రిటికల్ కేర్ అవసరమైనా ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. 60 వేల మంది బాధితులు ఒకేసారి వచ్చినా ట్రీట్ మెంట్ ఇచ్చేంత సామర్థ్యం వైద్య శాఖకు ఉందని తెలిపారు. గచ్చిబౌలీ స్టేడియంలోనూ ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పదవీ విరమణ చేసిన వైద్యులు, ఇతర సిబ్బందిని నియమించాలని తాను ఇప్పటికే వైద్య శాఖ అధికారులకు సూచించానని అన్నారు.
ఎక్కడా కరెంట్ పోకుండా చూసేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది 24 గంటలూ శ్రమిస్తున్నారని అన్నారు. ఎస్ఆర్ఎస్పీ, సాగర్ ఆయకట్టుకు ఏప్రిల్ 10వ తేదీ వరకూ నీటిని అందిస్తామని తెలిపారు. నేడు ఒక్క రోజే 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, కరోనాను తరిమేసేందుకు చేతిలో ఉన్న ఏకైక ఆయుధం సామాజిక దూరమేనని, ప్రజలు దాన్ని పాటించాలని కోరారు.ఏపీకి సంబంధించిన పిల్లలకు ఎటువంటి ఇబ్బందినీ రానివ్వబోమని, వారందరికీ ఇక్కడే అన్నం పెడతామని కేసీఆర్ తెలిపారు. ఎవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని, ఇక్కడున్న వారంతా తెలంగాణ బిడ్డలేనని, ప్రధాని సూచన మేరకు సాధ్యమైనంత వరకూ ప్రజల కదలికలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. పేదలు, అనాధలు ఆకలితో బాధపడకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంత ఖర్చయినా సరే, ఆహారం విషయంలో వెనుకాడేది లేదని అన్నారు.
భయంకర విపత్తుతో యుద్ధం చేస్తున్న సమయంలో ప్రజల సహాయ సహకారాలు ఎంతో అవసరమని, రాత్రి పూట కర్ఫ్యూ చాలా చక్కగా అమలవుతోందని, పగలు మాత్రం కొందరు పని లేకున్నా బయటకు వస్తున్నారని, అలా రావద్దని కోరారు. తాను రెండు చేతులూ జోడించి వేడుకుంటున్నానని, స్వీయ నియంత్రణే శ్రీరామరక్షని ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. పశువులకు గడ్డి తదితరాలను సరఫరా చేసే వాహనాలను వదిలేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు కేసీఆర్ తెలిపారు.
లక్షల ఎకరాల్లో పంట చేతికి అందే సమయం ఆసన్నమైందని, రైతుల పనికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని, పండిన పంటనంతా ప్రభుత్వమే కొనుగోలు చేసే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పండ్లు, కూరగాయలు తొలుత రాష్ట్ర అవసరాలకు వినియోగించిన తరువాతనే ఇతర ప్రాంతాలకు ఎగుమతి గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. బత్తాయి, కమలా, దానిమ్మ వంటి పండ్లను తింటే ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుందని, ఈ సంవత్సరం పంటను మనమే కాపాడుకుని, వాడుకుందామని కేసీఆర్ అన్నారు.