భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు డివిజన్: పోలీసులను హతమార్చేందుకు బాంబులు అమర్చుతున్న 12 మంది మావోయిస్టు గ్రామ కమిటీ సభ్యులను అరెస్టు చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం కొంతమంది మావోయిస్ట్ గ్రామ కమిటీ మెంబర్లు పోలీసులను చంపేందుకు మందుపాతరలను పెడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో కరకగూడెం ఎస్ఐ తన సిబ్బంధితో రేగళ్ళ, నిమ్మగూడెం అటవీ ప్రాంతానికి మరియు ఏడూళ్ళ బయ్యారం సిఐ తన సిబ్బందితో అశ్వాపురంపాడు –మొట్లతోగు అటవీ ప్రాంతానికి కూంబింగ్ కి వెళ్లారు. కూంబింగ్‌లో ఉన్న కరకగూడెం ఎస్ఐ బృందానికి మందుపాతర్లు అమర్చుతున్న మావోయిస్ట్ పార్టీ గ్రామ కమిటీ సభ్యులైన సోడి లింగయ్య, మొసకి సన్ను, మడకం రాజు, మడివి సాయి కిరణ్, పొడియం సింగయ్య అనే వ్యక్తులు పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుంచి టిఫిన్ బాక్సు, ఐదు జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్, 25 మీటర్ల వైరు, మూడు బ్యాటరీ సెల్స్ ను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం అక్కడ నుండి బయల్దేరి నిమ్మగూడెం గుట్ట వైపు కూంబింగ్ చేస్తుండగా పోడియం భీమయ్య, ముసకి రాజు, పోడియం రమేశ్, కుంజం శ్రీను అనే మరో నలుగురు మావోయిస్ట్ పార్టీ గ్రామ కమిటీ సభ్యులు పట్టుబడ్డారు. వీరి వద్ద కూడా టిఫిన్ బాక్సు, ఐదు జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్, 25 మీటర్ల వైరు, మూడు బ్యాటరీ సెల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఏడూళ్ళ బయ్యారం సీఐ తన సిబ్బందితో అశ్వాపురంపాడు – మొట్లతోగుకు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టగా పోడియం లక్ష్మయ్య, పోడియం అడమయ్య, కోవాసి సురేశ్ అను మావోయిస్ట్ పార్టీ గ్రామ కమిటీ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద కూడా టిఫిన్ బాక్సు, నాలుగు జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్స్, 25 మీటర్ల వైరు, 3 బ్యాటరీ సెల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని విచారించగా గత మూడు సంవత్సరాల క్రితమే మావోయిస్ట్ పార్టీ వీరందరినీ మావోయిస్ట్ గ్రామ కమిటీ సభ్యులుగా నియమించినట్లు తెలిపారు. నిషేధిత మావోయిస్ట్ పార్టీకి ఎటువంటి సహాయ సహకారాలు అందించినట్లు తమ దృష్టికి వచ్చినా అటువంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని మణుగూరు ఏఎస్పీ శబరీష్ తెలిపారు.