గొర్రెకుంట సామూహిక హత్యకేసులో నిందితుడు సంజయ్ కుమార్ ఎంత క్రూరంగా వ్యవహరించిందీ విచారణలో వెలుగులోకి వచ్చింది. అపస్మారక స్థితిలో ఉన్న తల్లి వద్ద మూడేళ్ల చిన్నారి బబ్లూ గుక్కపట్టి ఏడుస్తుంటే ఏమాత్రం కనికరం చూపని నిందితుడు చిన్నారిని తీసుకెళ్లి అమాంతం బావిలో పడేసి చంపేశాడు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులే విస్తుపోతున్నారు. సంజయ్‌ను నిన్న ఉదయం 5 గంటల ప్రాంతంలో ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయించారు. దీంతో ఆ తొమ్మిది మందినీ తానెలా హత్య చేసింది కళ్లకు కట్టినట్టు చూపించాడు.నిందితుడు తొలుత మక్సూద్ ఇంట్లో వండిన ఆహారంలో నిద్రమాత్రలు కలిపాడు. అది తిన్న వెంటనే మక్సూద్, అతడి భార్య నిషా, కుమార్తె బుస్రా, కుమారులు షాబాద్, షాహెల్, మరో వ్యక్తి వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ఆ వెంటనే పై అంతస్తులోకి వెళ్లిన సంజయ్, అక్కడ ఉంటున్న శ్రీరామ్, శ్యామ్ వండుకున్న ఆహారంలోనూ రహస్యంగా నిద్రమాతలు కలిపాడు. ఆహారం తిన్న వారిద్దరు కూడా మత్తులోకి జారిపోయారు. ఆ వెంటనే నిందితుడు తన పథకాన్ని అమలు చేశాడు. అందరినీ గోనె సంచుల్లో చుట్టి ఒక్కొక్కరిని బావి వద్దకు తీసుకెళ్లి అందులో పడేశాడు. అదే సమయంలో నిద్రలేచిన బబ్లూ అపస్మారక స్థితిలో ఉన్న తల్లి వద్దకు వెళ్లి లేపేందుకు ప్రయత్నిస్తూ గుక్కపట్టి ఏడుస్తున్నాడు. దీంతో తన ప్లాన్ ఎక్కడ బెడిసి కొడుతుందోనని భయపడిన సంజయ్.. పసివాడన్న జాలి, దయ లేకుండా బబ్లూని ఎత్తుకుని తీసుకెళ్లి బావిలో పడేశాడు.