దశాబ్దాల పోరాటం నుంచి అమెరికా సేనలు తప్పుకోవడంతో ఆప్ఘనిస్థాన్ లో మరోసారి అస్థిరత రాజ్యమేలుతోంది. దేశంలోని చాలావరకు భూభాగంపై తాము పట్టు సాధించామని తాలిబాన్లు ఇప్పటికే ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం భారత్ వైపు చూస్తోంది. తాలిబాన్లతో చర్చలు విఫలమైతే భారత్ నుంచి సైనిక సాయం కోరాలని భావిస్తున్నట్టు భారత్ లో ఆఫ్ఘన్ రాయబారి ఫరీద్ ముముంద్జాయ్ వెల్లడించారు.
అయితే, ఆఫ్ఘన్ కు సైనిక దళాలను పంపాలని తాము కోరడం లేదని, తమ సైనిక దళాలకు శిక్షణ, సాంకేతిక మద్దతు ఇవ్వాలని కోరతామని స్పష్టం చేశారు. ఆగస్టు చివరి నాటికి ఆఫ్ఘన్ నుంచి పూర్తిస్థాయిలో నిష్క్రమించేందుకు అమెరికా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో, తాలిబాన్ ప్రతినిధులకు, ఆఫ్ఘన్ ప్రభుత్వానికి మధ్య కొన్నిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి.
కాగా, దోహాలో జరుగుతున్న ఈ చర్చలు అత్యధికశాతం విఫలం అయ్యాయని, తాలిబాన్లు పరిపూర్ణ సైనిక విజయంగా ప్రకటించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని విదేశీ మీడియా పేర్కొంది.