గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 20 సీట్లు కూడా రావనే విషయం తేలిపోయిందని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ అన్నారు. జియాగూడలో బీజేపీ అభ్యర్థి దర్శన్ తరపున ఈరోజు ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఫెయిల్ అయిందని చెప్పారు. పాత మేనిఫెస్టోనే మళ్లీ కొత్తగా తీసుకొచ్చారని విమర్శించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో గురించి ప్రజలు మాట్లాడుకోవడం లేదని అన్నారు. బీజేపీ మత విద్వేషాలకు పాల్పడుతోందంటూ టీఆర్ఎస్ నేతలు అంటున్నారని… విద్వేషాలను సృష్టిస్తున్నది బీజేపీ కాదని, కేటీఆర్ అని వివేక్ చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కేటీఆర్ కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటు స్థానాల్లో, దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయిందని… గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఓడిపోబోతోందని చెప్పారు. కేటీఆర్ ఓటమిని అంగీకరించాలని అన్నారు.