ఇల్లంతకుంట మండలం కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
బండి సంజయ్‌ను సూటిగా అడుగుతున్నా.. ఈ రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్‌కు ప్రత్యేకంగా ఒక్క పైసా అయినా తెచ్చారా? మతం పేరుతో రెచ్చగొట్టడం, చిల్లర రాజకీయం చేయడం సరికాదు. దమ్ముంటే అభివృద్ధిలో తమతో పోటీ పడాలన్నారు. చేతనైతే కేంద్రం నుంచి రాష్ర్టాభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలి. దమ్ముంటే కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురా? అని సవాల్ చేశారు. చేతనైతే మరిన్ని జాతీయ రహదారులు, నవోదయ పాఠశాలలు తీసుకురా? అంతేకానీ తెల్లారితే చిల్లర మాటలు, చిల్లర కూతలు కూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు.
ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడితే కొత్త బిచ్చగాడు అని వదిలిపెడుతున్నారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని మాట్లాడాలి. దుబ్బాకలో గెలిచినోళ్లు.. ఇటీవల జరిగిన రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందలేకపోయారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించబోతోంది. అక్కడ బీజేపీ డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమన్నారు. త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. అభివృద్ధిలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కేటీఆర్ సూచించారు.