జనం అంతా కరోనా భయంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆందోళన చెందుతుంటే కొందరు దుర్మార్గులు సామాజిక మాధ్యమాల్లో చిల్లర ప్రచారానికి తెరతీస్తూ ప్రజల్ని మానసికంగా హింసిస్తున్నారని, అందుకు తగిన ప్రతిఫలం వారు అనుభవించి తీరుతారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. మేము గొప్పవాళ్లం, మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరన్న గర్వంతో కొందరు మూర్ఖులు పెట్రేగిపోతున్నారని, ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచం, దేశం ఆగం అవుతున్న సమయంలో వారి చిల్లర ప్రచారాలు న్యాయమేనా అని ప్రశ్నించారు. తమనెవరూ ఏమీ చేయలేరేమనుకుంటున్నారుగాని, వారు అంతకు అంత అనుభవించేలా నేను చేసి చూపిస్తానని హెచ్చరించారు. ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ముందుగా కరోనా పట్టుకోవాలని నేను శాపం పెడుతున్నానని అన్నారు.