లడఖ్ వద్ద గాల్వన్ లోయలో చైనా బలగాలతో భారత సైనికులకు గతరాత్రి ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన బి.సంతోష్ అనే కల్నల్ ర్యాంకు అధికారి కూడా మృతి చెందారు. తన కుమారుడి మరణవార్తపై సూర్యాపేటలో ఉన్న ఆయన తల్లి స్పందించారు. తనకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారని వెల్లడించారు. ఒక్క కొడుకూ ఇప్పుడు అమరుడయ్యాడని తెలిపారు. తల్లిగా బిడ్డను కోల్పోయిన బాధ ఉన్నా, తన కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించడం పట్ల ఆనందం కలుగుతోందని పుట్టెడు దుఃఖాన్ని భరిస్తూ నిబ్బరంగా చెప్పారు. తనకు ఈ విషయం ఇవాళ మధ్యాహ్నం తెలిసిందని, ఢిల్లీలో ఉన్న తన కోడలికి నిన్న రాత్రే ఈ విషయం తెలిసినా, తాను తట్టుకోలేనని ఇవాళ్టి వరకు చెప్పలేదని ఆమె వివరించారు.