ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లను ఎలాంటి ఆలస్యం లేకుండా చేసుకునే వీలుంటుందని ప్రభుత్వం చెపుతోంది. ఇప్పటి వరకు ఈ పోర్టల్ కేవలం వ్యవసాయ ఆస్తులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టులో న్యాయవాది గోపాల్ శర్మ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈనెల 10 వరకు స్టేను పొడిగించింది.పిటిషన్ ను విచారించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ కోరారు. దీంతో, గతంలో విధించిన స్టేను 10 వరకు కోర్టు పొడిగించింది.మరోవైపు రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తిగా నిలిచిపోయాయని… ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోర్టును ఏజీ కోరారు. ఈ విన్నపంపై కోర్టు స్పందిస్తూ… రిజిస్ట్రేషన్లను ఆపేయాలని తాము ఎన్నడూ ఆదేశించలేదని తెలిపింది. పాత విధానంలో రిజిస్ట్రేషన్లను కొనసాగించవచ్చని చెప్పింది. వీటి వివరాలను ధరణి పోర్టల్ లో నమోదు చేస్తామనే షరతు విధించి… రిజస్ట్రేషన్లను చేసుకోవచ్చని తెలిపింది.ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్లకు సంబంధించి రాజ్యాంగబద్ధమైన అనుమానాలు తమకు ఉన్నాయని… వాటిపై లోతుగా విచారణ జరపకుండా తాము అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రజల నుంచి సేకరించిన డేటాకు పూర్తి స్థాయిలో భద్రత ఉండాల్సిందేనని తెలిపింది.