కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీకి అంతా సిద్ధంగా ఉండాలని అక్టోబర్ చివరికల్లా పనులు పూర్తి చేయాలని అమెరికాలోని అన్ని రాష్ట్రాల గవర్నర్లకు, ఉన్నతాధికారులకు సీడీసీ లేఖ రాసింది. నవంబర్ 1 నుంచి అమెరికా కరోనా టీకా పంపిణీ (US Corona Vaccine) చేయనున్నట్లు తెలుస్తోంది.అమెరికా పౌరులకు ఆశలు చిగురిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ (CoronaVirus Vaccine) నవంబర్ నుంచి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ చివరికల్లా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, అన్ని రాష్ట్రాలు సిద్ధం కావాలంటూ ఆగస్టు 27న సీడీసీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ ఓ లేఖలో పేర్కొన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. నవంబర్ 1 నుంచి వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాల గవర్నర్లకు సీడీపీ సూచించింది. మెరుగైన టీకాను అమెరికా అందించనుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ (AstraZeneca) ఆమోదానికి చేరువలో ఉందని ఇటీవల ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరగాలని ట్రంప్ భావిస్తున్నారు. కాగా, అమెరికాలో ఇప్పటికే 1.8 లక్షల మంది (లక్షా 80 వేల మంది) కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయారు. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు అమెరికాలోనే సంభవించడం గమనార్హం. అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ కరోనా టీకా పనులు అమెరికాలో వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది.