కేంద్రానికి తాను రాసినట్టుగా ప్రచారం జరుగుతున్న లేఖను తాను రాయలేదని, అసలు ఆ లేఖకు, తనకు సంబంధం లేదని, ఈ లేఖను తాను రాసినట్టుగా సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్ర హోమ్ శాఖకు తాను లేఖ రాయలేదని, తన ప్రాణాలకు ముప్పు ఉందని భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఈ ఉదయం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన, ఆ లేఖ ప్రచారానికి, తనకు సంబంధం లేదని తెలిపారు. కాగా, ఈ ఉదయం పత్రికల్లో రమేశ్ కుమార్ రాసినట్టుగా ఉన్న లేఖకు సంబంధించిన వార్త తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికలను వాయిదా వేయాలని తాను నిర్ణయించిన తరువాత, బెదిరింపులు పెరిగాయని, తనకు ప్రాణహాని ఉందని, భద్రతను కల్పించాలని ఆయన హోమ్ శాఖను కోరినట్టుగా లేఖలో ఉంది. ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని సృష్టించిన వారు ఎవరు? అన్న అంశాలపై పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు.