నిర్భయ కేసులో దోషులు వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తూ ఉరితీత అమలును ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో వారిపై డెత్ వారెంట్లు ఇప్పటికి రెండు పర్యాయాలు వాయిదాపడ్డాయి. తొలుత జనవరి 22న ఉరితీయాలనుకున్నా, అప్పటికి దోషుల పిటిషన్లతో సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఫిబ్రవరి 1న ఉరికి సర్వం సిద్ధమైనా చివరి నిమిషంలో అదీ వాయిదాపడింది. దాంతో, నిర్భయ దోషులు నలుగురినీ ఉరితీసేందుకు కొత్త తేదీ ప్రకటించాలని తీహార్ జైలు అధికారులు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టును కోరారు. ఈ మేరకు దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వారు జీవించడానికి చట్టం అనుమతిస్తున్నప్పుడు, వారిని ఉరితీయాలనుకోవడం నేరపూరితమైన పాపం అవుతుంది అని పేర్కొంది. అంతేకాదు, తీహార్ జైలు అధికారులు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.