contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పడిపోయిన శానిటైజర్ ధరలు … ఎందుకో తెలుసా ???

 

కరోనా వైరస్ వ్యాప్తి చెంది, లాక్ డౌన్ ను ప్రకటించిన తరువాత, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భారీగా జరిగిన శానిటైజర్ అమ్మకాలు, ఇప్పుడు కనిష్ఠానికి పడిపోయాయి. కరోనాకు ముందు వరకూ శానిటైజర్ లను వాడిన వారు ఎవరూ లేరు. ఆపై ఒక్కసారిగా పరిస్థితి మారిపోగా, రేషన్ షాపుల ముందు క్యూ కట్టినట్టుగా ప్రజలు, శానిజైటర్ లను కొనేందుకు ఎగబడ్డారు. ఇళ్లు, ఆఫీసులు, బస్సులు, దుకాణాలు… ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ ఉన్నా, చేతులను శుభ్రపరచుకోవాల్సిందేనని ప్రజలు భావించడంతో వీటి అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి. ఎంతో మంది చిన్న చిన్న శానిటైజర్ బాటిల్స్ ను తమ జేబుల్లో పెట్టుకుని తిరగడం కూడా మనం చూశాం. కానీ, జూలైలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే, ఇప్పుడు కేవలం 30 శాతం అమ్మకాలు సాగుతున్నాయి.వాస్తవానికి మే, జూన్ నెలల్లో దుకాణాల్లో శానిటైజర్ల కొరత విపరీతంగా ఉండేది. కరోనా కారణంగా నష్టపోయిన ఎన్నో మాన్యుఫాక్చరింగ్ సంస్థలు, ప్రజల అవసరాన్ని, డిమాండ్ ను గుర్తించి శానిటైజర్ ఉత్పత్తులను తయారు చేయడం మొదలు పెట్టాయి. తమ అసలు ఉత్పత్తులను పక్కన బెట్టి శానిటైజర్లను పెద్దఎత్తున మార్కెట్లోకి వదిలాయి. కరోనా రావడానికి ముందు హైదరాబాద్ పరిసరాల్లో రెండు మూడు శానిటైజర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉండగా, వాటి సంఖ్య వేలల్లోకి చేరిపోయింది.మే, జూన్ నెలల్లో ఐదు లీటర్ల శానిటైజర్ క్యాన్ ధర రూ. 2 వేల వరకూఉండగా, సగటున ఒక్కో డిస్ట్రిబ్యూటర్ నుంచి 10 వరకూ క్యాన్లతో పాటు 100 ఎంఎల్, 200 ఎంఎల్, 300 ఎంఎల్ సీసాలు 100 నుంచి 200 వరకూ సరఫరా అవుతుండేవి. జూలై వచ్చేసరికి వీటి ధరలను కేంద్రం నియంత్రించింది. దీంతో 5 లీటర్ల క్యాన్ రూ.1,000కి పడిపోయింది. అయినా, వీటి అమ్మకాలు సంతృప్తికరంగానే సాగాయి.ఇక, కరోనా వచ్చిన తొలి రోజుల్లో ఉన్న భయం క్రమంగా ప్రజల్లో తగ్గిపోయింది. రోజుకు వస్తున్న కొత్త కేసుల సంఖ్య వేలల్లో ఉన్నా, ప్రజలు భయపడటం లేదు. కరోనా కూడా మామూలు జ్వరంలాగానే తగ్గుతుందని, ఇంట్లోనే ఉండి చికిత్స చేసుకోవచ్చని ప్రజలు నమ్ముతుండటంతో శానిటైజర్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. కరోనా సోకిన తరువాత రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతూ ఉండటంతో శానిటైజర్లు కొనేవారే కరవయ్యారు. దీంతో ఓ దశలో రూ. 2 వేల వరకూ అమ్మిన శానిటైజర్ క్యాన్ ధర, ఇప్పుడు రూ. 400కు పడిపోయింది.ఎన్నో మెడికల్ షాపుల్లో పెద్దఎత్తున శానిటైజర్ ఉత్పత్తులు పేరుకు పోవడంతో, వాటిని కొనేవారు లేక, వెనక్కు ఇచ్చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రజల్లో కరోనా భయం పూర్తిగా తగ్గిపోవడమే ఇందుకు కారణమని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అంటున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :