పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. కూచ్‌బెహర్‌లో బీజేపీ-టీఎంసీ కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణలను అదుపు చేసేందుకు కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించగా, గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ యువ ఓటరు ప్రాణాలు కోల్పోయాడు. కూచ్‌బెహర్‌లోని శీతల్‌కుచిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆనంద్ బుర్మాన్ అనే ఓటరు తీవ్రంగా గాయపడి మరణించాడు.దీనికి మీరు కారణమంటే, మీరే కారణమంటూ అధికార టీఎంసీ, బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఆనంద్ బుర్మాన్ తమ పోలింగ్ ఏజెంట్ అని పేర్కొన్న బీజేపీ.. టీఎంసీ కార్యకర్తలే అతడిపై కాల్పులకు తెగబడ్డారని ఆరోపించింది. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన టీఎంసీ.. బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసింది.ఇది క్రమంగా వాగ్వివాదం స్థాయి నుంచి ఘర్షణకు దారితీసింది. మరింత శ్రుతిమించడంతో ఒకరిపై ఒకరు బాంబులు విసురుకున్నారు. అప్రమత్తమైన కేంద్ర బలగాలు ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీ చార్జీ చేశాయి. అయినప్పటికీ పరిస్థితి సద్దుమణగకపోవడంతో కాల్పులు ప్రారంభించాయి. కాల్పుల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మోహరించారు.