ఎన్నికల ముందు హామీలిచ్చిన అంశాలతో పాటు హామీలు ఇవ్వని అంశాలను కూడా ఏపీ జగన్ ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయాలు తీసుకుంటుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ప్రజలకు జగన్ సేవ చేసుకుంటూ వెళ్తున్నారు’ అని వ్యాఖ్యానించారు
‘అయితే, ఏపీ బడ్జెట్ పరిస్థితి గురించి తెలిసిన వారికి ఓ డౌట్ వస్తుంది. రేపు రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందన్న అనుమానం వస్తోంది. ప్రభుత్వం నడపడం అనేది పెద్ద విశేషమేమీ కాదు ఆదాయం ఉంటే నడపొచ్చు. గత సీఎం అమరావతికే ప్రాధాన్యత ఇచ్చి దానికే ఖర్చు చేశారు. ఇప్పటి సీఎం ప్రజా సంక్షేమంపైనే ఎక్కువ పెడుతున్నారు’ అని చెప్పారు. ఏడు లక్షల పింఛన్లు రద్దయ్యాయన్న విషయంపై ప్రచారం జరుగుతోంది తప్ప కొత్తగా ఇచ్చిన 14 లక్షల ఫింఛన్లపై ప్రచారం జరగడం లేదని ఆయన చెప్పారు. ‘ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి, జీడీపీ పెరగాలి, ట్యాక్స్ వస్తుంది, అప్పుడు ఏయే కార్యక్రమాలు చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. పోలవరం ఏటీఎంలా తయారయిందని మోదీ కూడా అన్నారు. అయితే, ఇందుకు సంబంధించిన లెక్కలను మాత్రం చూపలేదు’ అని చెప్పారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. 14 ఏళ్ల క్రితమే వైఎస్సార్ ఈ ఆలోచన చేశారన్నారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటును పరిశీలించాలని అన్నారు.