భారత్ లో మార్చి 31 తర్వాత బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్ ను నిలిపివేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి కేవలం బీఎస్-6 ప్రమాణాలతో తయారైన వాహనాలే రిజిస్ట్రేషన్ కు అనుమతిస్తారు. ఇప్పటికే అనేక కార్ల తయారీ కంపెనీలు తమ బీఎస్-4 స్టాక్ ను వదిలించుకునేందుకు పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. అంతేకాదు, బీఎస్-4 మోడళ్లను బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా అప్ డేట్ చేసి మార్కెట్లో కొత్త మోడళ్లు ప్రవేశపెడుతున్నాయి. అయితే, కొన్ని కంపెనీలు పలు మోడళ్లకు బీఎస్-6 అప్ డేట్ వెర్షన్లు తీసుకువచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. వాటిని బీఎస్-4తోనే నిలిపివేయాలని భావిస్తున్నాయి. అలాంటి మోడళ్లలో ముందుగాగా చెప్పుకోవాల్సింది టాటా సుమో, టాటా సఫారీల గురించి. ఈ రెండు మోడళ్లు భారత రోడ్లపై ఓ విప్లవాన్ని సృష్టించాయని చెప్పాలి. 90వ దశకంలో రంగప్రవేశం చేసిన సుమో అత్యధిక విక్రయాలతో టాటా కంపెనీకి విపరీతమైన లాభాలు తెచ్చిపెట్టింది. కాలగమనంలో టయోటా ఫార్చ్యూనర్ వంటి వాహనాల రాకతో సుమోలు కాలం చెల్లిపోయాయి. సఫారీ పరిస్థితి కూడా అంతే! ఇవే కాదు, మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్, టాటా బోల్ట్, టాటా జెస్ట్, ఫోక్స్ వ్యాగన్ అమియో, టొయోటా ఇటియోస్, ఇటియోస్ లీవా, ఇటియోస్ క్రాస్, హ్యుందాయ్ యాక్సెంట్, మహీంద్రా వెరిటో, మహీంద్రా కేయూవీ 100, రెనో లాడ్జీ కార్లకు బీఎస్4తో చరమగీతం పాడనున్నారు.