చెన్నై: తమిళనాడులో బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై (BJP office) దుండగుడు పెట్రోల్ బాంబుతో దాడిచేశారు. గురువారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో చెన్నైలోని తమిళనాడు బీజేపీ ఆఫీస్‌పై గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ బాంబు విసిరాడు.
దీంతో ఆఫీసు పాక్షికంగా దెబ్బతిన్నది. బాంబు దాడి జరిగినప్పుడు కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఆఫీస్‌పై పెట్రోల్ బాంబు విసిరారని పార్టీ నేత కరాటే త్యాగరాజన్ ఎప్పారు. రాష్ట్రంలో బీజేపీ కార్యాలయంపై ఇలాంటి దాడి జరడగం ఇదే మొదటిసారి కాదన్నారు. పదిహేనేండ్ల క్రితం డీఎంకే అధికారంలో ఉన్న సమయంలోనే ఇలాంటి ఘటన జరిగిందని చెప్పారు.
ఈ ఘటన వెనక ప్రభుత్వ హస్తం ఉన్నదని త్యాగరాజన్ ఆరోపించారు. దానిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. ఇలాంటి దాడులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని తెలిపారు. ఈ ఘటనపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు.