దౌత్యపరమైన మార్గాలు, చారిత్రక ఆధారాలు, డాక్యుమెంట్ల సాయంతో భారత్ తో కాలాపాని వివాదాన్ని పరిష్కరించుకుంటామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చెప్పారు. భారత్ తో చర్చలు జరుపుతామని… భారత్ ఆక్రమించుకున్న భూభాగాన్ని వెనక్కి తెచ్చుకుంటామని తెలిపారు. సైన్యాన్ని మోహరించి కాలాపాని ప్రాంతాన్ని భారత్ ఆక్రమించుకుందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. కాళీ నదిని కృత్రిమంగా క్రియేట్ చేసిందని, కాళీ ఆలయాన్ని నిర్మించిందని అన్నారు.భారత్ లోని కాలాపాని, లిపులేక్, లింపియాదురా ప్రాంతాలను కలపుకొని నేపాల్ కొత్త మ్యాప్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాప్ కు ఇంకా నేపాల్ పార్లమెంటు ఆమోదం లభించాల్సి ఉంది. మరోవైపు, నేపాల్ తీరును భారత్ ఖండించింది. ఆ ప్రాంతాలన్నీ భారత భూభాగాలేనని చెప్పింది. నేపాల్ ఆరోపణల వెనుక చైనా ప్రోద్బలం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.