భారత సరిహద్దులకు సమీపంలో సైనిక మోహరింపులు చేపడుతూ కవ్వించడం చైనాకు కొత్త కాదు. అయితే ఇటీవలే చైనా తూర్పు లడఖ్ కు సమీపంలో యుద్ధ విమానాలతో విన్యాసాలు నిర్వహించినట్టు వెల్లడైంది. ఈ విన్యాసాల్లో 20కి పైగా చైనా యుద్ధ విమానాలు పాల్గొన్నాయని భారత సైన్యం చెబుతోంది. హోటన్, గర్ గున్సా, కష్గర్ ప్రాంతాల్లో జరిగిన ఈ విన్యాసాల కోసం జే-11, జే-16 రకం యుద్ధ విమానాలు వినియోగించారని రక్షణ వర్గాలు తెలిపాయి. వీటిలో జే-11లను భారత్ వద్ద ఉన్న సుఖోయ్-27లను కాపీ కొట్టి తయారుచేసిన విమానాలు అని ప్రచారంలో ఉంది.
కాగా, చైనా తన యుద్ధ విమానాల విన్యాసాలను ఎంతో జాగ్రత్తగా నిర్వహించినట్టు తెలుస్తోంది. భారత్ తో సరిహద్దులకు సమీపంలోనే ఈ విన్యాసాలు చేపట్టినా, ఎక్కడా భారత గగనతలంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గతేడాది గాల్వన్ లోయ ఘర్షణల అనంతరం భారత్ ఈ ప్రాంతంలో వాయుసేనను మరింత పటిష్ఠం చేసింది.
భారత్ కు చెందిన మిగ్-29 యుద్ధ విమానాలు నిత్యం సరిహద్దుల వద్ద కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో చైనా తన పరిమితులకు లోబడి వ్యవహరించినట్టు అర్థమవుతోంది. పైగా, ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన శత్రుభీకర రాఫెల్ యుద్ధ విమానాలను కొన్నింటిని భారత్ లడఖ్ ప్రాంతంలోనే మోహరించడం చైనాను ఆత్మరక్షణలో పడేసిందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.