కరోనా మహమ్మారి కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తలకిందులయ్యే ప్రమాదం ఏమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. “ఆర్థిక వ్యవస్థ పరంగా ఎటువంటి చింతా వద్దు. మన ఆర్థిక వ్యవస్థ బాగుంది. ఈ సమయంలో ప్రజలు రెండు గజాల దూరం ‘దో గజ్ దూరీ’ పాటిస్తే, అదే జీవితాలను కాపాడుతుంది. సమీప భవిష్యత్తులో అదే శ్రీరామరక్ష. ఇండియాలో అమలవుతున్న లాక్ డౌన్ వేలాది మంది ప్రాణాలను కాపాడిందని ముఖ్యమంత్రులంతా పలుమార్లు వ్యాఖ్యానించారు. ఇక భవిష్యత్తులో రెడ్ జోన్లను ఆరంజ్ జోన్లుగా, ఆరంజ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్చేందుకు శ్రమించాలి” అని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సొంతంగా వాహనాలను కలిగివున్న వారు కొన్ని నియమాలను పాటిస్తూ, తిరిగేందుకు అనుమతించి, బస్సులు సహా రైళ్లు, విమానాల నిషేధం కొనసాగుతుందని కూడా మోదీ సూచనప్రాయంగా తెలిపారు. ప్రజల్లో ఉన్న లాక్ డౌన్ మైండ్ సెట్ అలాగే ఉండాలి. భౌతిక దూరాన్ని పాటించడంలో కొత్త నిబంధనలు తీసుకుని వచ్చేలా మోదీ నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నామని మేఘాలయ ముఖ్యమంత్రి కొన్ రాడ్ సంగ్మా ఆశాభావం వ్యక్తం చేశారు.