తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతోన్న విషయం తెలిసిందే. భారీ వరదల ధాటికి పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని అలీనగర్‌లో రెండు రోజుల క్రితం అబ్దుల్ తాహిర్ అనే వ్యక్తి కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఇంటి అరుగుపై కూర్చున్న సమయంలో వరదనీటిలో గల్లంతయ్యారు. వారిలో తాజాగా నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.నిన్న రాత్రి రెండు మృతదేహాలను ఫలక్‌నుమా సమీపంలోని నాలాలో సిబ్బంది గుర్తించారు. మరో రెండు మృత దేహాలను ఈ రోజు తెల్లవారు జామున గుర్తించారు. మృతి చెందినవారిలో ముగ్గురు మహిళలు, ఓ బాలిక ఉన్నారు. ఈ ఘటనలో మరో నలుగురి కోసం పోలీసులు, సిబ్బంది గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. అయితే, ఆయా ప్రాంతాల్లో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో గల్లంతైన వారిని గుర్తించడం కోసం సిబ్బందికి కష్టంగా మారింది. మరోవైపు అల్‌జుబైల్ కాలనీలో రెండు మృతదేహాలు నీటిలో కొట్టుకొచ్చాయి.అదే ప్రాంతంలో ఇంటిగోడ కూలడంతో మరో వ్యక్తి మృతి చెందాడు. అసిమాబాద్ లో 100 గేదెల కళేబరాలు బయటపడ్డాయి. హైదరాబాద్ లో కురిసిన వర్షాల కారణంగా ఇప్పటికీ పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాతబస్తీ, అసిమాబాద్, అల్‌జుబైల్ తో పాటు పలు కాలనీలు జయమయమయ్యాయి. ఆ ప్రాంతాల్లో దాదాపు 250 కుటుంబాలను సహాయక బృందాలు పడవల సాయంతో బయటకు తీసుకొచ్చారు.