తెలంగాణలో మద్యం దుకాణాల వేళలను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాత్రి 9.30 గంటల వరకు అనుమతి ఉండగా, ఇప్పుడు దానిని మరో గంటన్నర పెంచారు. ఫలితంగా రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచే ఉండనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. లాక్‌డౌన్ కారణంగా మూతబడిన మద్యం షాపులు మే ఆరో తేదీన తిరిగి తెరుచుకున్నాయి. తొలుత సాయంత్రం ఏడున్నర గంటల వరకే అనుమతి ఇవ్వగా, ఆ తర్వాత రెండు దఫాలుగా 9.30 గంటల వరకు సమయాన్ని పెంచారు. ఇప్పుడు మరో గంటన్నర పెంచిన ప్రభుత్వం రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్ముకునే వెసులుబాటును కల్పించింది. నిన్నటి నుంచే పెంచిన వేళలు అమల్లోకి వచ్చాయి.