తలకు రుమాలు, సాధారణ దుస్తుల్లో ఓ వ్యక్తి పాత బైకుపై సిద్దిపేటలో దూకుడుగా వెళ్లాడు. 10 పోలీసు చెక్‌పోస్టులను దాటేశాడు. ‘ఎక్కడికి వెళ్తున్నావ్’ అంటూ పోలీసులు దబాయించగా మెకానిక్‌నని ఓ చోట, మెడికల్ షాప్‌కి వెళ్తున్నానంటూ మరోచోట బదులిచ్చాడు. ‘మంత్రి నాకు తెలుసు..కావాలంటే పీఏకి ఫోన్ చేసి మాట్లాడ’ంటూ ఓ చెక్‌పోస్టు వద్ద దర్పం ప్రదర్శిస్తే.. పోలీసులు నిరాకరించారు. ‘జ్వరం మాత్రలూ తెచ్చుకోనివ్వరా’ అని ఓ చోట ప్రశ్నిస్తే.. ఎస్‌ఐ స్థాయి అధికారి గర్జించాడు. ఇదంతా చదివి ఏమనుకుంటున్నారు? అత్యవసర పని ఉన్న ఆ వ్యక్తి ఏదోలా గమ్యం చేరడానికి పోలీసులకు సాకులు చెబుతున్నారనుకుంటున్నారా..? అయితే అది పొరపాటే.. సిద్దిపేటలో లాక్‌డౌన్ అమలు, ప్రజల పట్ల పోలీసుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి అదనపు ఎస్పీ రామేశ్వర్ ఇలా సాధారణ పౌరుడి అవతారమెత్తారు. అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. తిరుగు పయనంలో రుమాలు లేకుండా వచ్చిన ఆ అదనపు ఎస్పీని చూసి..ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది.
https://www.facebook.com/TheReporterTeluguIndia/videos/129633162483555