ఏడేళ్ల కిందట చత్తీస్ గఢ్ లో ఓ ఘోరం జరిగింది. అమాయకులైన 17 మంది గ్రామస్తులు పోలీసుల కాల్పుల్లో బలయ్యారు. మావోయిస్టులుగా పొరబడి గ్రామస్తులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన 2012 జూన్ 28న జరిగింది. బీజాపూర్ జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు సర్కే గూడ గ్రామంలో ఓ జనసమూహం కనిపించింది. అది మావోయిస్టుల సమావేశమేనని భావించిన పోలీసు బలగాలు కాల్పులు జరిపాయి. భారీగా ప్రాణనష్టం జరగడంతో నక్సల్స్ కు పెద్ద ఎదురుదెబ్బ అని భావించారు. అయితే ఈ కాల్పుల ఘటనపై అనేక సందేహాలు రావడంతో నాటి బీజేపీ సర్కారు న్యాయపరమైన దర్యాప్తుకు ఆదేశించింది. జస్టిస్ వీకే అగర్వాల్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ అనేక కోణాల్లో విచారణ జరిపి ఇటీవలే తన నివేదికను చత్తీస్ గఢ్ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం… బీజ్ పందుమ్ అనే వేడుక గురించి చర్చించుకునేందుకు సమావేశమైన గ్రామస్తులను మావోయిస్టులు అనుకుని పోలీసులు కాల్పులు జరిపినట్టు వెల్లడైంది. అప్పట్లో తమపై కాల్పులు జరిపినందునే తాము ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసు బలగాలు తెలిపినా, అదంతా వట్టిదేనని, గ్రామస్తుల నుంచి ఎలాంటి కాల్పులు జరగలేదని నివేదికలో పొందుపరిచారు.
ఈ నివేదిక మీడియాకు దొరకడంతో అందులోని విషయాలు వెల్లడయ్యాయి. భారీ స్థాయిలో అమాయకులను పొట్టనబెట్టుకున్న ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది.