ఆంధ్రప్రదేశ్ / నర్సీపట్నం : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్వహించిన శంఖారావం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ… నన్ను, చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను తిడితేనే వైసీపీలో టికెట్లు ఇస్తారంట… తిట్టని వాళ్లకు నో టికెట్! అంటూ వ్యాఖ్యానించారు.
టీడీపీ వర్గాలు జనసైనికులను తిడుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇరు పార్టీల వారు అప్రమత్తంగా ఉండాలని లోకేశ్ స్పష్టం చేశారు. మన మధ్య గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మనం ఒకే నినాదానికి కట్టుబడి ఉండాలి… హలో ఏపీ.. బై బై వైసీపీ అనే నినాదానికి కట్టుబడి ఉండాలి అని లోకేశ్ పేర్కొన్నారు.
ఈ క్రమంలో లోకేశ్ సీఎం జగన్ పైనా ధ్వజమెత్తారు. జగన్ లక్ష కోట్ల ఆస్తులున్న ఒక పేదవాడు అని వ్యంగ్యం ప్రదర్శించారు. విశాఖలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కడుతున్న జగన్ ఒక పేదవాడు అని వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో జగన్ అహంకారానికి, తెలుగువాడి ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం అని నారా లోకేశ్ స్పష్టం చేశారు.
మేం ప్రజల్లో ఉంటాం… జగన్ పరదాలు కట్టుకుని తిరుగుతాడని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో పయనిస్తే, జగన్ హయాంలో ఉత్తరాంధ్రను గంజాయికి కేంద్రంగా మార్చారని ఆరోపించారు.