రూ. 5 లక్షలు ఇవ్వకుంటే కుటుంబ సభ్యులను చంపేస్తానని, యాసిడ్ పోస్తానని వ్యాపారి కుమారుడిని బెదిరించిన కానిస్టేబుల్‌ను మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. ప్రస్తుతం గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్‌లో గోవింద్ కానిస్టేబుల్. గతంలో మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో పనిచేశాడు. ఆ సమయంలో గోవింద్.. పార్క్ రోడ్డులోని సాధు సోడా సెంటర్ నిర్వాహకుడు మునాఫ్ ఇంటి పక్కన ఉండేవాడు. ఈ క్రమంలో వారితో సాన్నిహిత్యం పెరిగింది.గోవింద్ గత కొన్ని రోజులుగా మునాఫ్ కుమారుడు బాషాను రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇందుకోసం ఇద్దరు ఆటో డ్రైవర్లను వాడుకున్నాడు. వారి సెల్‌ఫోన్ల నుంచి బాషాకు బెదిరింపు మెసేజ్‌లు పంపేవాడు. తాజాగా, మరోమారు మెసేజ్ చేసిన గోవింద్.. రూ. 5 లక్షలు ఇవ్వకుంటే కుటుంబ సభ్యులను హతమారుస్తానని, యాసిడ్ పోస్తానని అందులో పేర్కొన్నాడు. అది చూసి భయపడిన బాషా పోలీసులను ఆశ్రయించి విషయం చెప్పాడు.స్పందించిన పోలీసులు బాషా మొబైల్ నుంచి గోవింద్‌కు మెసేజ్ చేయించారు. రూ. 5 లక్షలు అంటే కష్టమని, రూ.3 లక్షలు మాత్రమే ఇవ్వగలనని అందులో పేర్కొన్నాడు. మెసేజ్ చూసి నిజమేనని నమ్మిన నిందితుడు గోవింద్ డబ్బులు పెట్టిన బ్యాగ్‌ను నిడమర్రు రైల్వేగేటు వద్ద ఉన్న ఓ దుకాణం పేరు చెప్పి అందులో పెట్టి వెళ్లిపోవాలని తిరిగి మెసేజ్ చేశాడు.