రెవెన్యూ విధానంలో అనేక సంస్కరణలతో తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం అమలుకు తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సర్కారు వీఆర్వో వ్యవస్థను కూడా రద్దు చేసింది. ఈ చట్టం నేడు అసెంబ్లీ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్ రావు స్పందించారు. తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం దేశానికే దశ దిశ చూపనుందని ఉద్ఘాటించారు. అవినీతి, ఆలస్యం వంటి బాధల నుండి పేదలు, రైతులకు విముక్తి కల్పించే చారిత్రక చట్టం అని అభివర్ణించారు. రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలు నవశకానికి నాంది పలకనున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు హరీశ్ రావు ట్వీట్ చేశారు.