18వ తేదీ నుంచి ప్రారంభంకానున్న లాక్ డౌన్ 3.0లో పరిమితులతో కూడిన మరిన్ని సడలింపులను సిద్ధం చేసినట్టు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. మూడో విడత లాక్ డౌన్ పొడిగింపు తప్పనిసరి అయిన పరిస్థితుల్లో, సాధారణ పరిస్థితులు నెలకొల్పడమే లక్ష్యంగా, సడలింపులకు రూపకల్పన చేసినట్టు హోమ్ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు. రాష్ట్రాలు అందించే బ్లూ ప్రింట్ ఆధారంగా, అవకాశమున్న ప్రతి ప్రాంతంలోనూ ప్రజా రవాణా తిరిగి ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు.
క్షేత్ర స్థాయిలో పరిస్థితులను మదించిన తరువాతే నిర్ణయాలు ఉంటాయని, లిమిటెడ్ కెపాసిటీతో స్థానిక బస్సులు నడుపుకోవచ్చని, హాట్ స్పాట్ ప్రాంతాల్లో మాత్రం ఈ సదుపాయం ఉండదని స్పష్టం చేశారు. ప్రజా రవాణా నిమిత్తం బస్సులను అనుమతించిన ప్రాంతాల్లో పాసింజర్ల సంఖ్యపై నియంత్రణలు పాటిస్తూ, ఆటోలు, టాక్సీలు నడుపుకునే అవకాశాన్ని కూడా అందిస్తామని తెలిపారు.ఇక రాష్ట్రాల పరిధిలో హాట్ స్పాట్ లను నిర్ణయించుకునే అధికారం, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి బదలాయించాలని చాలా మంది సీఎంలు చేసిన డిమాండ్ పై సానుకూల నిర్ణయం వెలువడుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ అమలైన నిబంధనలతో పోలిస్తే, లాక్ డౌన్ 4.0 విభిన్నంగా ఉంటుందని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కంటైన్ మెంట్ ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్లా ఈ సడలింపులు ఉంటాయని ఆయన తెలిపారు.
ట్రావెల్ పాస్ లను కలిగివున్నవారు రాష్ట్రాలు దాటి వెళ్లేందుకు అనుమతి లభిస్తుందని, వచ్చే వారం నుంచి విమాన సర్వీసులను నడిపించేందుకూ నిర్ణయం తీసుకోవచ్చని, ఇప్పటికే మొదలైన రైలు సేవలను మరింతగా విస్తరించేందుకు కసరత్తు జరుగుతోందని తెలిపారు. అన్ని రకాల వస్తువులనూ హోమ్ డెలివరీ చేసేందుకు అనుమతులు లభించవచ్చన్నారు.ఇదే సమయంలో వైరస్ వ్యాప్తించిన ప్రాంతాల్లో మరిన్ని కఠిన నిబంధనలు ఉంటాయని, రాష్ట్రాలు గుర్తించిన హాట్ స్పాట్ లలో ఎటువంటి కార్యకలాపాలకూ అనుమతి ఉండదని, మిగతా ప్రాంతాల్లో నిబంధనల సడలింపు ఉంటుందని స్పష్టం చేశారు. హోమ్ శాఖ వద్ద ఉన్న గణాంకాల మేరకు పలు రాష్ట్రాల్లోని 11.9 లక్షల మంది ప్రజలు ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు.
కేసుల సంఖ్య అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్ లలో జిల్లాల మధ్య ప్రయాణానికి అనుమతులు ఉండబోవని, కేసులు అధికంగా ఉన్న చోట్ల పరిశ్రమలు తెరిచేందుకూ వీల్లేదని మరో అధికారి వ్యాఖ్యానించారు. ఏపీ, కేరళ, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాలు చాలా సెక్టార్లను తిరిగి తెరిపించాలని కోరాయని, బీహార్, జార్ఖండ్, ఒడిశాలు మాత్రం స్వస్థలాలకు వచ్చేస్తున్న వలస కార్మికులను దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ కొనసాగించాలని కోరాయని ఆయన గుర్తు చేశారు.