గోరేగావ్ కుట్ర కేసులో అరెస్ట్ అయి, దాదాపు ఏడాది కాలంగా జైలు జీవితాన్ని గడుపుతున్న విప్లవ కవి వరవరరావుకు బాంబే హైకోర్టు కొద్దిసేపటి క్రితం బెయిల్ ను మంజూరు చేసింది. ఆయన అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తున్నట్టు ఈ సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. తనపై ఆరోపణలు ఉన్న కేసు విచారణకు సంబంధించి, పోలీసులకు సహకరించాలని, సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నిస్తే, బెయిల్ ను రద్దు చేస్తామని ఈ సందర్భంగా న్యాయమూర్తి వరవరరావును హెచ్చరించారు. నేటి సాయంత్రం లోగా బెయిల్ పేపర్లను జైలు అధికారులకు అందించి, విడుదలయ్యేలా చూస్తామని ఆయన తరఫు న్యాయవాదులు వెల్లడించారు.