ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య నేత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. వెంకట్రామిరెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ ఆ లేఖలో స్పష్టం చేశారు. ప్రాణహాని కలిగిస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా ఉంచాలని నిమ్మగడ్డ డీజీపీని కోరారు.అంతకుముందు, ఏపీ ఉద్యోగుల సమాఖ్య నేత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వాలని, వ్యాక్సిన్ ఇచ్చేంత వరకు తాము ఎన్నికల విధులకు హాజరు కాబోమని తెగేసి చెప్పారు. అంతేకాదు, ప్రాణాపాయం వస్తే ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసే హక్కును కూడా రాజ్యాంగం కల్పించిందని అన్నారు.