కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పరిపాలన తొమ్మిదేళ్లు గడిచినప్పటికీ నేటి వరకు కూడా అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందకపోవడం దుర్మార్గమని సిపిఐ జిల్లా నాయకుడు బోనగిరి మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజా సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల హామీలు నెరవేర్చాలని, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు బుధవారం మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం తహశీల్దార్ ఐ.బావు సింగ్ కు వినతి పత్రం అందజేశారు. ధర్నాకు ముఖ్యఅతిథిగా మహేందర్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక వాగ్దానాలు చేశాడని, ఎన్నికల అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరికీ అందించడంలో వైఫల్యం చెందాడని మహేందర్ ఆరోపించారు. దళితులను ఆర్థిక అభివృద్ధిలో ముందంజలో ఉంచాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం మండలంలో దళితులందరికీ ఇవ్వకపోవడం సరైనది కాదని, కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకోవడం పట్ల, మిగతా అర్హులైన దళిత కుటుంబాలు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారని, వారందరికి కూడా దళిత బంధు ఇవ్వాలని మహేందర్ డిమాండ్ చేశారు. మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ప్రభుత్వమే అందిస్తుందని ప్రకటించిన నేటికీ వాటి జాడేలేదని,నిర్మించి ఉన్న ఇండ్లను కూడా పంపిణీ చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని,కొత్తగా ఇటీవల సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ఇండ్ల నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని మూడు లక్షలతో ఇండ్ల నిర్మాణం చేసుకోలేని నిరుపేదలు ఉన్నారని మూడు లక్షలు కాదు ఐదు లక్షలు ఇస్తే ఎంతోకొంత వారికి ఉపయోగకరంగా ఉంటుందని మహేందర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డులే ఇప్పటివరకు ఉన్నాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం సరైనది కాదని తక్షణమే రేషన్ కార్డులను ఇవ్వాలని, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని పూర్తిగా మాఫీ చేయకపోవడం పట్ల రైతులు నిరాశతో ఉన్నారని, తక్షణమే గ్రామాల్లో సర్వే నిర్వహించి అర్హులైన వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పెన్షన్లు కూడా మంజూరు చేయాలని మహేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామని చెప్పిన ప్రభుత్వం అమలుపరచడంలో కొంత నిర్లక్ష్యం వహిస్తుందని,ప్రభుత్వ విద్యను పటిష్ట పరచాలని, విద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలని, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వాలని, వైద్య రంగాన్ని గ్రామస్థాయిలో మెరుగుపరిచి పేదలందరికీ వైద్యాన్ని అందుబాటులో కి తేవాలని ఇలాంటి అనేక సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ప్రభుత్వంపై మరిన్ని పోరాటాలు నిర్వహించక తప్పదని మహేందర్ హెచ్చరించారు.ధర్నా కార్యక్రమంలో మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి, సహాయ కార్యదర్శులు చొక్కల శ్రీశైలం, మొలుగురి సంపత్, ఏఐవైఎఫ్ మండల నాయకులు మొలుగూరి ఆంజనేయులు, గ్రామ కార్యదర్శి బోయిని మల్లయ్య, కోశాధికారి ఘర్షకుర్తి శ్రీనివాస్, పంబాల ఆంజనేయులు, లాసాని పీరయ్య,చెరుకు ఆంజనేయులు, సురేష్, టేకు రాజవ్వ, మంగారపు పద్మ,రామంచ కొమురయ్య, న్యాత సంపత్,న్యాతా అంజయ్య,న్యాత యాకూబ్, ఖాజా బేగం,ఎండి నయీమ్, వెదిరే మల్లవ్వ,వేదిరే నర్సయ్య, బొమ్మాడి సురేందర్ రెడ్డి, కంసాని కనకవ్వ తదితరులు పాల్గొన్నారు.
