సీబీఐ తదుపరి చీఫ్ ను నియమించేందుకు నిన్న ప్రధాని మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి కమిటీ భేటీ అయింది. ఈ కమిటీలో ప్రధానితో పాటు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్ సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి (కాంగ్రెస్) సభ్యులుగా ఉన్నారు. అయితే సీబీఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఒక కొత్త నిబంధనను తెరపైకి తీసుకొచ్చారు. ‘ఆరు నెలల రూల్’ ను సీజేఐ ఈ భేటీలో ప్రస్తావించారు.ఈ నిబంధంన ప్రకారం ఏ ఐపీఎస్ అధికారి అయినా కనీసం ఆరు నెలల పాటు సర్వీసు మిగిలి ఉంటేనే… వారు పోలీస్ చీఫ్ పదవులకు అర్హులని సీజేఐ రమణ తెలిపారు. ఐపీఎస్ అధికారి ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు గతంలోనే ఈ మేరకు తీర్పును వెలువరించిందని గుర్తు చేశారు. ఆ నిబంధనను ఇప్పుడు కూడా సెలెక్షన్ ప్యానెల్ కచ్చితంగా అమలు చేయాలని అన్నారు. సీజేఐ లేవనెత్తిన ఈ పాయింట్ కు అధిర్ రంజన్ చౌధురి మద్దతు పలికారు.
సీబీఐ డైరెక్టర్ పదవి కోసం 1984-87 మధ్య బ్యాచ్ లకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు మొత్తం 109 పరిశీలనలోకి వచ్చాయి. నిన్న మధ్యాహ్నం 1 గంలకు వీరిలో 10 మంది రేసులో నిలిచారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆరుగురిని షార్ట్ లిస్ట్ చేశారు.ప్రస్తుతం రేసులో ముందు వరుసలో మహారాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ జైశ్వాల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సశాస్త్ర సీమా బల్ కేఆర్ చంద్ర మరియు కేంద్ర హోం శాఖ స్పెషల్ సెక్రటరీ వీఎస్కే కౌముదు ఉన్నారు. వీరిలో సుబోధ్ కుమార్ అత్యంత సీనియర్ కావడం గమనార్హం. ఈయననే తదుపరి సీబీఐ చీఫ్ గా నియమించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.
మరోవైపు, బి ఎస్ ఎఫ్ చీఫ్ గా ఉన్న రాాకేశ్ ఆస్తానా (ఆగస్ట్ 31న రిటైర్మెంట్), ఎన్ఐఏ చీఫ్ వైసీ మోదీ (మే 31న రిటైర్మెంట్) రేసులో ఉన్నప్పటికీ… సీజేఐ లేవనెత్తిని రూల్ తో వారికి ద్వారాలు మూసుకుపోయాయి. కేంద్ర ప్రభుత్వం వీరి పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది. వీరిలో ఒకరిని సీబీఐ చీఫ్ గా నియమించాల భావించింది. అయితే, ఆరు నెలల రూల్ వీరికి ప్రతిబంధకంగా మారింది.
మరోవైపు భేటీ సందర్భంగా అధిర్ రంజన్ చౌధురి మాట్లాడుతూ, సీబీఐ చీఫ్ పదవికి పేర్లను ఎంపిక చేసే సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి అలసత్వాన్ని ప్రదర్శించిందని అన్నారు. ప్యానల్ మీటింగ్ ముందు రోజే 109 పేర్లలో 16 మందిని తొలగించడం దీనికి నిదర్శనమని చెప్పారు. నిబంధనలను దృష్టిలో పెట్టుకోకుండా అధికారుల పేర్లను షార్ట్ లిస్ట్ చేశారని అన్నారు.