సీబీఐకి కొత్త డైరెక్టర్ వచ్చేశారు. మొత్తం 109 మందిని వడపోసిన త్రిసభ్య కమిటీ చివరికి మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్‌ను ఎంపిక చేసింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు. సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్‌సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురిలతో కూడిన త్రిసభ్య కమిటీ సుదీర్ఘ వడపోత అనంతరం జైశ్వాల్‌ను ఎంపిక చేసింది.నిజానికి సీబీఐ నూతన డైరెక్టర్ పదవి రేసులో సుబోధ్ కుమార్ ముందు నుంచి ఉన్నారు. సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ కేఆర్ చంద్ర, కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి వీఎస్కే కౌముది కూడా పోటీలో నిలిచినప్పటికీ సుబోధ్ కుమార్ అత్యంత సీనియర్ కావడంతో ఆయనకే ఈ పదవి దక్కింది. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న రిషికుమార్ శుక్లా ఫిబ్రవరిలోనే పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి పూర్తిస్థాయి డైరెక్టర్ లేకుండానే సీబీఐ పనిచేస్తోంది.