పలు రాష్ట్రాల్లో వరుసగా హత్యలు చేస్తున్న సైకో కిల్లర్ దిలీప్ దివాల్ ను మధ్యప్రదేశ్ పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులకూ గాయాలు అయ్యాయి. ఈ ఘటన రాట్లాం జిల్లాలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, గుజరాత్ లోని దాహోద్ ప్రాంతానికి చెందిన దిలీప్ ఇంతవరకూ వివిధ రాష్ట్రాల్లో ఆరు హత్యలు చేశాడు. గత నెల 25న ప్రజలు చొట్టీ దివాలీ పర్వదినాన్ని జరుపుకుంటున్న వేళ, రాట్లాంలో దంపతులను, వారి కుమార్తెను హత్య చేశాడు.బాణసంచా పేలుళ్ల శబ్దం మిన్నంటుతుంతగా, అతని తుపాకీ కాల్పుల చప్పుళ్లు ఎవరికీ వినిపించలేదు. ఆ కుటుంబాన్ని చంపేసి, దోచుకోవాలన్న ఆలోచనతోనే దివాల్ వచ్చాడని పేర్కొన్న పోలీసులు, అంతకుముందే కొంత భూమిని అమ్మిన సదరు వ్యక్తి, ఇంట్లో డబ్బు దాచి వుంచాడని తెలుసుకున్న నిందితుడు ఈ ఘోరానికి పాల్పడ్డాడు. అపై అతన్ని నిన్న గుర్తించిన పోలీసులు, లొంగిపోవాలని హెచ్చరించగా, పోలీసులపై కాల్పులకు దిగడంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని ఉన్నతాధికారులు వెల్లడించారు.