పోర్చుగల్‌లోని లెఫ్టిస్టు ఆలోచనాధోరణితో కూడిన సోషలిస్ట్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోమారు విజయం సాధించింది. కోవిడ్‌తో కునారిల్లిన పోర్చుగల్ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు యూరోపియన్ యూనియన్ వందల కోట్ల యూరోల సాయాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోషలిస్టుపార్టీ మరోమారు విజయదుందుభి మోగించింది. కరోనా వైరస్ కేసుల పెరుగుదల సమయంలో జరిగిన ఈ ఎన్నికలలో 230 సీట్ల పార్లమెంటులో సోషలిస్టులు 106 సీట్లు గెలుచుకున్నారు.
ఆదివారానికి ఎన్నికల్లో 98.5 శాతం ఓట్లను లెక్కించగా ఇందులో సోషలిస్టులు 41 శాతం ఓట్లను పొందారు. సోషలిస్టుల ప్రధాన ప్రత్యర్థి సెంటర్–రైట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీకి 28 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పార్టీ 65 పార్లమెంటరీ స్థానాలను గెలుచుకుంది. దేశంలోని 1.08 కోట్ల అర్హులైన ఓటర్లలో ఈ దఫా విదేశాల్లో నివసిస్తూ మెయిల్ ద్వారా ఓటు వేసే 15 లక్షల మంది ఓట్లను పరిగణనలోకి తీసుకోలేదు. మరోదఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ప్రధాని ఆంటినో కోస్టాకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పోర్చుగల్‌తో బలమైన బంధాన్ని కోరుకుంటున్నామన్నారు.