ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి ఎట్టకేలకు తెలంగాణ కేడర్ అధికారిగా మారిపోయారు. ఉమ్మడి ఏపీ విభజన సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా తనను తెలంగాణ కేడర్‌కు కేటాయించాలని అభిషేక్ మహంతి ఆప్షన్ ఇవ్వగా.. అందుకు విరుద్ధంగా ఆయనను ఏపీ కేడర్‌కు బదిలీ చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.ఈ క్రమంలో ఆయనకు ఏపీ కేడర్‌లో పోస్టింగ్ కూడా దక్కింది.
అయితే తాను కోరినట్టుగా తనను తెలంగాణ కేడర్‌కు బదిలీ చేయాలని అభిషేక్ మహంతి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్(క్యాట్)ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన క్యాట్..అభిషేక్ అభ్యర్థనకు సమ్మతించి ఆయనను తెలంగాణ కేడర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనను రిలీవ్ చేయాలని ఏపీకి, చేర్చుకోవాలంటూ తెలంగాణకు ఆదేశాలు జారీ చేసింది.
క్యాట్ ఆదేశాల మేరకు అభిషేక్‌ను ఏపీ రిలీవ్ చేసినా.. తెలంగాణ మాత్రం ఆయనను సర్వీసులోకి తీసుకోలేదు. దీనిపై మరోమారు అభిషేక్ క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన క్యాట్ తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సోమేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.హైకోర్టులోనే అభిషేక్‌కు అనుకూలంగానే తీర్పు రాగా.. మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా అభిషేక్‌ను తెలంగాణ కేడర్‌లోకి తీసుకుంటున్నట్లుగా ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో నెలల తరబడి అఖిషేక్ కొనసాగించిన పోరాటం మంగళవారంతో ముగిసింది.