కేంద్ర బడ్జెట్లో ఈసారి జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్సార్డీపీ పనులకు నిధులందుతాయేమోనని పలువురు ఎదురు చూశారు. కానీ.. నిధులు కనిపించలేదు. జీహెచ్ఎంసీ దాదాపు రూ.25వేల కోట్లతో ఎస్సార్డీపీ కింద పలు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులకు శ్రీకారం చుట్టింది. ఇందుకు అప్పులు, బాండ్ల జారీ ద్వారా నిధులు సేకరించడంతోపాటు సొంత ఖజానా నిధులు సైతం రూ.3వేల కోట్లు ఖర్చు చేసింది. కొన్ని పనులు పూర్తి కాగా, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. పనులు ప్రారంభించాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి.
నగరాభివృద్ధికి సంబంధించిన పనులకు కేంద్రం సహకారం కూడా ఉంటుందని ఇటీవల ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఎస్సార్డీపీ పనులకు కేంద్రం తనవంతుగా రూ.1400 కోట్లు ఆర్థిక సహకారం అందించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. నగరంలో నిర్మిస్తున్న లింక్‌రోడ్లు, స్లిప్రోడ్ల కోసం మరో రూ.800 కోట్లు అడిగారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖరాయడం తెలిసిందే. దీంతో కేంద్రం నుంచి ఎంతోకొంత సహకారం అందగలదని భావించిన వారి అంచనాలు తలకిందులయ్యాయి.హైదరాబాద్‌ను కరుణించని నిర్మల.. అంచనాలు తలకిందులు