సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగర వాసులకు ఇది శుభవార్తే. కరోనా కారణంగా దాదాపు ఆరు నెలలపాటు డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే జిల్లా సర్వీసులు తిరుగుతుండగా నేటి నుంచి రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన రూట్లలో బస్సులు తిరగనున్నాయి.ముఖ్యంగా పటాన్‌చెరు–చార్మినార్, పటాన్‌చెరు–హయత్‌నగర్, ఉప్పల్–లింగంపల్లి, గచ్చిబౌలి–దిల్‌సుఖ్‌నగర్‌తోపాటు చార్మినార్, జూపార్కు, ఎల్‌బీనగర్, చింతల్, బీహెచ్‌ఈఎల్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాలకు ఎక్కువ సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. అలాగే, వీటిలో ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ సర్వీసులే ఉండనున్నాయి. నేడు సిటీలో మొత్తం 625 బస్సులను తిప్పాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. అలాగే, ఎయిర్‌పోర్టు మార్గంలోనూ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.పరిస్థితులు సానుకూలంగా ఉంటే మరో వారం, పది రోజుల తర్వాతి నుంచి 50 శాతం బస్సులను అనుమతించనున్నట్టు తెలుస్తోంది. కాగా, కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా నేటి నుంచే బస్సులు ప్రారంభం కానున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్–తెలంగాణ మధ్య బస్సు సర్వీసుల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.