పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలో త్రవ్వకాలలో క్రీ.శ.13వ శతాబ్దం కాకతీయుల కాలం నాటి దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. శివాలయం ప్రధాన ఆర్చి నిర్మాణం కోసం భూమిని తవ్వుతున్న క్రమంలో విగ్రహాలు బయటపడ్డాయి. ఇవి క్రీ.శ.13వ శతాబ్దం కాకతీయుల కాలం నాటివని పురావస్తు పరిశోధకులు చెబుతున్నారు. లభ్యమైన శిల్పాలలో మహిషాసుర మర్ధిని, చతుర్ముఖ బ్రహ్మ, చెన్నకేశవ, చాముండి, సరస్వతీ దేవత విగ్రహాలు ఉన్నాయని స్థానిక ఆచార్య నాగార్జున శిల్ప కళాశాల అధినేత చెన్నుపాటి శ్రీనివాస్ చెప్పారు.ఈ విగ్రహాలు కాకతీయ గణపతి దేవుని కాలం నాటివని పేర్కొన్నారు. చారిత్రక ప్రాధాన్యత గల శిల్పాలను శివాలయంలోనే పీఠాలపై నిలబెట్టి చారిత్రక వివరాలను నామ, పలాలతో ఆరు బయట మ్యూజియంగా ఏర్పాటు చేయాలని పురావస్తు పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కోరారు. ఈ దేవత విగ్రహాలను చూసేందుకు ప్రజలు శివాలయానికి భారీగా తరలివస్తున్నారు.