తల్లి వద్దని, భార్యే కావాలంటూ పట్టుబట్టిన ఓ 16 ఏళ్ల బాలుడిని న్యాయస్థానం షెల్టర్ హోంకు తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో బాలుడు వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 వరకు అంటే మైనారిటీ తీరే వరకు అక్కడే ఉండనున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పదహారేళ్ల తన కుమారుడిని తన సంరక్షణలో ఉండేలా అనుమతించాలని తల్లి, కాదు, తన వద్దే ఉండేలా అనుమతించాలని భార్య అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
మైనర్ వివాహం చెల్లుబాటు కాదు కాబట్టి తల్లి వెంట వెళ్లాలని కోర్టు చెబితే.. తాను భార్యతోనే ఉంటానని తేల్చి చెప్పాడు. అయితే, మేజర్ అయిన యువతితో పంపించేందుకు అంగీకరిస్తే అది పోక్సో చట్టం ప్రకారం నేరం అవుతుంది. దీంతో కోర్టు చివరికి అతడిని షెల్టర్ హోంకు తరలిస్తూ అదేశాలు జారీ చేసింది.
మైనారిటీ తీరే వరకు అక్కడే ఉండాలని ఆదేశించింది. ఆ తర్వాత అతడు ఎవరితో కావాలనుకుంటే వారితో ఉండొచ్చని పేర్కొంది. కాగా, బాలుడికి ఇప్పటికే ఓ బాబు ఉండడం గమనార్హం. గత నెల 31న కోర్టు ఈ తీర్పు వెల్లడించగా, రెండు వారాల తర్వాత కోర్టు వెబ్‌సైటులో పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది.