తమ దేశాన్ని రష్యా నుండి కాపాడుకునేందుకు ప్రతి పౌరుడినీ ఓ సైనికుడిలా మారుస్తోంది ఉక్రెయిన్. ప్రతి ఒక్కరికీ ఆయుధాలనిస్తామంటూ ప్రకటించిన ఒక్కరోజులోనే.. పౌరుల చేతికి ఆయుధాలను అందజేసింది. ఇప్పటికే దేశ రాజధాని కీవ్ లో స్థానికులకు ఆర్మీ 10 వేల అసాల్ట్ రైఫిళ్లను అందజేసింది.
అంతేకాదు.. జనాల కోసం గన్నులను బహిరంగంగా అమ్ముతున్నారు. తమ దేశాన్ని కాపాడుకునేందుకు ప్రజలు కూడా తుపాకులను కొనుగోలు చేస్తున్నారు. తుపాకుల దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రజలు పరిమితుల్లేకుండా తుపాకులు కొనుగోలు చేసేలా ఉక్రెయిన్ పార్లమెంట్ ఇప్పటికే ముసాయిదా బిల్లును పాస్ చేయడంతో ప్రజలు తుపాకుల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. తుపాకీ రేంజ్, మోడల్ ను బట్టి 600 డాలర్ల నుంచి 5 వేల డాలర్ల దాకా ధర పలుకుతోంది.
కాగా, తుపాకులతో పాటు వైరి బలగాలపై ఓ కన్నేసి ఉంచేందుకు డ్రోన్లనూ కొంటున్నారు. ప్రస్తుతం ఈ నెలలోనే ఇప్పటిదాకా 10 వేల తుపాకులను కొనుగోలు చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా దేశంలో 7 లక్షల తుపాకులకు లైసెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
మరోపక్క, ఆంటోనోవ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై రష్యా దాడికి ప్రయత్నించి విఫలమైందని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. ఆ విమానాశ్రయం ప్రస్తుతం ఉక్రెయిన్ ఆర్మీ అధీనంలోనే ఉందని వెల్లడించింది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల (ఆ దేశ కాలమానం ప్రకారం) వరకు 800 మంది రష్యా సైనికులను చంపినట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ సహాయ మంత్రి హన్నా మల్యార్ ప్రకటించారు. అంతేగాకుండా ఆ దేశానికి చెందిన 30 యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని చెప్పారు. 7 యుద్ధ విమానాలు, 6 హెలికాప్టర్లను కూల్చేశామని పేర్కొన్నారు.
కాగా, రష్యా దళాలు ఇప్పటికే ఉక్రెయిన్ లోని చెర్నోబిల్ అణు కర్మాగారాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. రాజధాని కీవ్ ను పూర్తి స్వాధీనం చేసుకునేందుకు శరవేగంగా ముందుకు కదులుతున్నాయి.