పదిమంది పిల్లలున్న తల్లి . ఇక తన వల్ల కాదని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. అదే ఆమె చేసిన నేరం. విషయం తెలిసిన భర్త అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. భార్యా పిల్లలను ఇంటి నుంచి గెంటేశాడు. ఒడిశాలోని కియోంఝర్ జిల్లా టెల్కోయి సమితి డిమిరియా గ్రామంలో జరిగిందీ ఘటన.
గ్రామానికి చెందిన రవి దహురి-జానకి దెహురి భార్యాభర్తలు. వీరికి ఇప్పటికే పదిమంది సంతానం. జానకి ఇటీవల మరోమారు గర్భం దాల్చింది. అయితే, ప్రసవ సమయంలో బిడ్డ చనిపోయింది. మరోవైపు కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో పోషణ కష్టమైంది. పిల్లలకు సరైన తిండి పెట్టలేక అర్ధాకలితో ఆ కుటుంబం నెట్టుకొస్తోంది.
ఇప్పటికే పదిమంది పిల్లలుండడం, తరచూ అనారోగ్యం పాలవుతుండడంతో ఆశా కార్యకర్తల చొరవతో జానకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. విషయం తెలిసిన భర్త రవి ఆమెను ఇంట్లోకి రానీయకుండా అడ్డుకున్నాడు. పితృదేవతలకు పూజలు చేసేందుకు పనికిరావంటూ ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. అంతేకాదు.. ఇంట్లోకి వస్తే చంపేస్తానంటూ ఇంటి బయట మారణాయుధాలతో కాపుకాస్తున్నాడు.
దీంతో రోడ్డున పడిన ఆమెకు ఆశాకార్యకర్తలే దిక్కయ్యారు. తల్లీపిల్లలకు ఆహారం అందిస్తున్నారు. విషయం తెలిసిన ఆరోగ్య అధికారులు రవికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో తల్లీపిల్లలను సంరక్షణ కేంద్రానికి తరలించి రవిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.