వైసీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాల్ చేసారు. పల్నాడు జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త రాజకీయాల పైన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు.
ఓటమి అంటే తెలియని రాజకీయ చరిత్ర తనదని చెప్పుకొచ్చారు. కొంత కాలంగా మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ బ్రహ్మారెడ్డి..వైసీపీ నేతల మధ్య రాజకీయ పోరాటం కొనసాగుతోంది. రెండు నెలల క్రితం మాచర్ల కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమైంది. మాచర్లలో పోలీసు ఆంక్షలు కొనసాగాయి. వచ్చే ఎన్నికలు ఇక్కడ రాజకీయంగా ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఈ సమయంలోనే పిన్నెళ్లి సంచలన ప్రకటన చేసారు.
మాచర్లలో ఏం జరిగినా కొంత కాలంగా రాజకీయ వివాదంగా మారుతోంది. 2004 నుంచి మొదలైన తన వరుస విజయాలు 2024లోనూ కొనసాగుతాయని ఎమ్మెల్యే..విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేసారు. 2024లో తనను ఓడించగలిగితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని పిన్నెల్లి సవాల్ చేసారు. తన మీద ఇప్పటి వరకు ఒక్కో ఎన్నికలో ఒక్కో అభ్యర్ధిని నాలుగు సార్లు టీడీపీ ప్రయోగించిందనిజజ అందరూ ఓడిపోయారని చెప్పుకొచ్చారు.
నియోజకవర్గంలో ఏం జరిగినా తన పైన రుద్దటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. టీడీపీ నేతల హెచ్చరికలు..వార్నింగ్ లకు ఎవరూ భయపడరని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై అంకెలతో సహా చర్చకు సిద్ధమని ప్రకటించారు. నియోజకవర్గంలో ఈ నాలుగేళ్ల కాలంలో రూ 930 కోట్ల మేర సంక్షేమ పథకాలు అమలు చేసామని చెప్పారు.
భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయనునున్నట్లు పిన్నెల్లి వెల్లడించారు.టిడిపి నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. తాజాగా మిరియాల గ్రామంలో జరిగిన ట్రాక్టర్ దగ్ధం ఘటన వైసీపీ నేతలకు సంబంధం లేదని ఎమ్మెల్యే పిన్నెల్లి స్పష్టం చేసారు. పిన్నెల్లి తొలుత పల్నాడు వెల్దుర్ది జెడ్పీటీసీగా కాంగ్రెస్ లో పని చేసారు. 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2009లో రెండో సారి విజయం సాధించి..జగన్ పార్టీ ప్రారంభం నుంచి ఆయనకు మద్దతుగా నిలిచారు. 2012లో కాంగ్రెస్ నుంచి అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసి గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లోనూ వరుసగా గెలుస్తూ వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా సమీకరణాలతో మంత్రి పదవి దక్కలేదు. దీంతో విప్ పదవి కేటాయించారు. ఇక, ఇప్పుడు మాచర్లలో కొనసాగుతున్న రాజకీయ పరిణామల మధ్య ఎమ్మెల్యే పిన్నెల్లి తాజా సవాల్ పైన టీడీపీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.