హైదరాబాద్: ర్యాగింగ్‌లు, లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఆడపిల్లల మాన, ప్రాణాలతో ఆడుకుంటున్న కీచకుల తాట తీస్తామని తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ అదనపు డీజీ శిఖాగోయెల్ హెచ్చరించారు. ఎవరైనా లైంగిక వేధింపులకు, ర్యాగింగ్‌కు, బెదిరింపులకు పాల్పడినా.. అవమానపూరితంగా నిందించినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని బాధితులకు సూచించారు. ర్యాగింగ్‌కు తాళలేక మెడికో ప్రీతి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో శిఖా గోయెల్ ‘మీడియా’తో పలు విషయాలను పంచుకున్నారు. వేధింపులు ఏవైనా ఫిర్యాదు చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. కళాశాలల్లో ర్యాగింగ్‌పై యాజమాన్యాలు సరిగా స్పందించకపోతే వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. మహిళా పిటిషనర్లకు సాయమందించేందుకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా ఉమెన్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వీటితోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో షీటీమ్స్ కార్యాలయాలు మహిళా పోలీస్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా ఎక్కడైనా బాధితులు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఫిర్యాదు చేయాలంటే..
వేధింపులకు గురైన విద్యార్థినులు వ్యక్తిగతంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఫిర్యాదు చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లలో ఫిర్యాదు చేయవచ్చని శిఖా గోయెల్ పేర్కొన్నారు. అత్యవసరమైతే 100, 102 నంబర్లకు డయల్ చేయాలని, లేదంటే స్టేట్ షీ టీమ్ వాట్సాప్ నంబర్ 9441669988 ద్వారా కూడా ఫిర్యాదు చేయాలని చెప్పారు. అన్ని యూనిట్లలో షీటీమ్స్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా ఫిర్యాదు చేసే వీలున్నదని, బహిరంగ ప్రదేశాల్లో షీటీమ్స్ క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా లేదా womensafetyts@ Gmail. comకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రతి ఆడబిడ్డ తమ స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ‘హక్‌ఐ’ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని, దాని ద్వారా లేదా ట్విట్టర్, ఫేస్‌బుక్, పోస్టు ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. బాధితులు 18 ఏండ్లలోపువారైతే 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలనిసూచించారు.
బాధితుల వివరాలు గోప్యం
బాధితులు ఏ మాధ్యమం ద్వారా పోలీసులను సంప్రదించినా వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, ఎట్టిపరిస్థితుల్లోనూ వెల్లడించబోమని శిఖా గోయెల్ తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, ఇందుకోసం కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారం తీసుకోవాలని సూచించారు. విద్యా సంస్థలు, పని ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో ర్యాగింగ్, ఇతర వేధింపులను అరికట్టేందుకు, కీచకులను కటకటాల్లోకి నెట్టి బాధితులకు న్యాయం చేసేందుకు బలమైన యంత్రాంగం ఉన్నదని చెప్పారు.
ఏ సమస్యకైనా మరణం పరిష్కారం కాదు. చావుతో అన్నీ సాధ్యం కావు. సమస్యలకు భయపడి ఆత్మహత్యలకు పాల్పడితే ఆగమయ్యేది మన కుటుంబమే. కీచకుల పీచమణచాలంటే బాధితులు ధైర్యంగా ముందుకు రావాలి. ఎవరైనా లైంగిక వేధింపులు, బెదిరింపులు, అవమానాలకు లోనైనా, ర్యాగింగ్ బారిన పడినా వెంటనే తమను సంప్రదించాలని తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ సూచిస్తున్నది. బాధితుల పేర్లు బయట పెట్టకుండానే కీచకుల తాట తీస్తామని భరోసా ఇస్తున్నది.