ఉక్రెయిన్ ను దెబ్బకొట్టేందుకు రష్యా వేస్తున్న ప్రణాళికలను ఆ దేశం సమర్థంగా తిప్పికొడుతోంది. ప్రాణానికి ప్రాణం తీస్తోంది. ఉక్రెయిన్ సైనికులను ఊచకోత కోసేందుకు చెచెన్యా ప్రత్యేక బలగాల సాయాన్ని రష్యా తీసుకుంటోంది. ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేసేలా రష్యా ఆదేశించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీని హత్య చేసేందుకు స్కెచ్ వేసింది.
ఈ నేపథ్యంలోనే చెచెన్యా బలగాలను ఉక్రెయిన్ లోకి చొరబడేలా చేస్తోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ లోకి ఎంటరైన రక్తపిశాచులైన చెచెన్యా బలగాలను ఉక్రెయిన్ సైన్యం మట్టుబెట్టింది. హోస్టోమెల్ కు సమీపంలో 56 యుద్ధ ట్యాంకుల్లో వస్తున్న చెచెన్యా సైన్యాన్ని పేల్చి పారేసింది. ఈ దాడిలో ఎంత మంది చనిపోయారో కచ్చితమైన నంబర్ తెలియకపోయినప్పటికీ.. వందలాది మంది చెచెన్ బలగాలు హతమై ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
దాడి ఘటనలో చెచెన్ జనరల్ మాగోమెద్ తుషాయెవ్ కూడా చనిపోయినట్టు అధికారులు చెప్పారు. చెచెన్యాకు చెందిన మోటరైజ్డ్ నేషనల్ గార్డ్ 141 బ్రిగేడ్ కు కమాండర్ గా పనిచేశాడు. చెచెన్యా అధినేత రంజాన్ కాదిరోవ్ కు మాగోమెద్ తుషాయెవ్ అత్యంత సన్నిహితుడు అని చెబుతుంటారు.
చెచెన్ స్పెషల్ బలగాలు అత్యంత క్రూరమైనవని చెబుతుంటారు. వారికి చిక్కిన యుద్ధ సైనికులను హింసించి చంపడంలో దిట్ట అని అంటూ ఉంటారు. వారి రక్తదాహానికి వేలాది మంది బలైపోయారన్న వాదనలూ ఉన్నాయి.