తిరుపతి: ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎపిఎస్ పిడిసిఎల్) పరిధిలో ఈ యేడాది మే నుంచి ఆన్ లైన్ ఇంటర్నల్ ఆడిట్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్) వి.ఎన్. బాబు పేర్కొన్నారు. తిరుపతిలోని ఎపిఎస్ పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం సంస్థ పరిధిలోని అకౌంట్స్ విభాగపు అధికారులు, ఇంటర్నల్ ఆడిటర్స్, ఆడిట్ అసిస్టెంట్లతో ఎపిఎస్ పిడిసిఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) వి.ఎన్. బాబు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వి.ఎన్. బాబు మాట్లాడుతూ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోష రావు ఆదేశాలకు అనుగుణంగా సంస్థ పరిధిలో ఆన్ లైన్ ఇంటర్నల్ ఆడిట్ విధానాన్ని ఏప్రిల్ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. సంస్థ ఐటి విభాగం రూపొందించిన అప్లికేషన్ ద్వారా సంస్థ పరిధిలోని ప్రతి సర్కిల్లో రెండు ఇఆర్ ఓలు (ఎలక్ట్రిసిటీ రెవిన్యూ ఆఫీస్), రెండు ఎక్స్పెండిచర్ యూనిట్లను ఆన్ లైన్ విధానంతో అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. వీటి ద్వారా లోటుపాట్లను అధిగమించి మే 1 నుంచి పూర్తి స్థాయిలో గోలైవ్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఆడిటింగ్ ను పారదర్శకంగా నిర్వహించడం ద్వారా విద్యుత్ రెవిన్యూ నష్టాలను తగ్గించడానికి అవకాశం వుంటుందని, ఆడిట్ విధానాన్ని ఆటోమేషన్ చేయడం ద్వారా ఆడిటింగ్ ప్రాసెస్ వేగవంతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎసిఎసిపిడిసిఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ కె.ఆర్.ఎస్. ధర్మజ్ఞాని, జనరల్ మేనేజర్లు పద్మ, రవి, సురేంద్రరావు, పే ఆఫీసర్ గాయత్రీ భాయి, సీనియర్ ఆకౌంట్స్ ఆఫీసర్ శ్రీకాంత్, ఆకౌంట్స్ ఆఫీసర్లు ప్రసన్నాంజనేయులు, నరేంద్ర, శ్రీధర్, బాలాజీ, అసిస్టెంట్ ఆకౌంట్స్ ఆఫీసర్ శివకుమార్, సంస్థ పరిధిలోని చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి ఇంటర్నల్ ఆడిటర్లు అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.
