తిరుపతి: తిరుపతి శ్రీకోదండరామస్వామివారి తెప్పోత్సవాలు సోమవారం రాత్రి శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తివారు ఆశీనులై ఐదుచుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై కర్పూర నీరాజనాలు సమర్పిస్తారు.
ఘనంగా ఖనిజం తోట ఉత్సవం:
శ్రీ కోదండరామస్వామివారి ఖనిజం తోట ఉత్సవం సోమవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ కోదండరాముని బ్రహ్మోత్సవాల అనంతరం ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
పూర్వం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వెనుక పాతహుజూర్ ఆఫీసులో ఉండే దిగుడు బావిలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారికి స్నపన తిరుమంజనం జరిగేది. దానికి గుర్తుగా ఆ సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు జరిగిన తరువాత శ్రీ కోదండరామస్వామి ఆలయం చేరుకుంటారు.
ఉత్సవంలో భాగంగా ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 4 గంటలకు శ్రీరాములవారు ఆలయం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ వాహన మండపానికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహించారు. తిరిగి అక్కడినుండి బయలుదేరి రామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు మారుతీ ప్రసాద్, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ రమేష్ కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.