- 16న బీరంగూడలో విశ్వగురు మహాత్మ బసవేశ్వరుడి కాంస్య విగ్రహ ఆవిష్కరణ
- ముఖ్యఅతిథిగా హాజరుకానున్న మంత్రి హరీష్ రావు, ప్రజా ప్రతినిధులు.
- 30 లక్షల రూపాయల సొంత నిధులతో విగ్రహం ఏర్పాటు..
- విశ్వ గురువు బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటు చేయడం నా పూర్వజన్మ సుకృతం..
- సమ సమాజ స్థాపనలో బసవేశ్వరుడు పాత్ర అనిర్వచనీయం
- విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా – పటాన్చెరు: సమాజంలో మనుషులందరూ సమానమేనని, శ్రమకు మించిన సౌందర్యం లేదంటూ 12వ శతాబ్దంలోనే తన బోధనల ద్వారా విశ్వ గురువుగా పేరొందిన మహాత్మా బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తన పూర్వజన్మ సుకృతం అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
ఈనెల 16వ తేదీన బీరంగూడ చౌరస్తాలో 30 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేయనున్న మహాత్మ బసవేశ్వరుడి కాంస్య విగ్రహ ఆవిష్కరణ ఆహ్వాన పత్రికను గురువారం రాత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీరంగూడ కిష్టారెడ్డిపేట రహదారి విస్తరణలో భాగంగా తొలగించిన బసవేశ్వరుడి విగ్రహ స్థానంలో 30 లక్షల రూపాయల సొంత నిధులతో కాంస్య విగ్రహాన్ని తయారు చేయించినట్లు తెలిపారు.
ఈనెల 16న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం మహాత్మ బసవేశ్వరుడు జయంతిని అధికారికంగా నిర్వహించడంతోపాటు, రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంకు బండ్ పైన బసవేశ్వరుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. సమాజంలో ఒక వర్గానికి పరిమితం కాకుండా అన్ని వర్గాలకు విశ్వ గురుగా పేరొందిన మహాత్మా బసవేశ్వరుడి బోధనలు అందరికీ అనుసరినీయమన్నారు.
విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.