మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రాజకీయాలకు, కుల, మతాలకు అతీతంగా అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి రాజకీయ, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అట్టడుగు వర్గంలో జన్మించి ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా ఉన్నత చదువులు చదివిన గొప్ప వ్యక్తి ఆంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మన రాజ్యాంగ సృష్టికర్తగా అయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేయాలన్నారు.