- రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి
తిరుపతి :రాయలసీమనిధులు నీళ్లు నియామకాల కోసం ఈ నెల 24న కర్నూల్ లో చేపట్టినన్న రాయలసీమ కర్తవ్య దీక్షను విజయవంతం చేయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం “రాయలసీమ కర్తవ్యం దీక్ష” కరపత్రాలను రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, స్టీరింగ్ కమిటీ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి రాయలసీమ జేఏసీ కన్వీనర్ డా” శ్రీకాంత్ పాటూరి ఇతర స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి తరతరాలుగా జరుగుతున్న మోసాన్ని ఎండగడుతూ రాయలసీమ హక్కుల సాధన కోసం “రాయలసీమ కర్తవ్య దీక్ష” నినాదంతో ఏప్రిల్ 24 న సోమవారం కర్నూలు ఎస్టీ బీసీ కళాశాల మైదానంలో రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ శ్రీ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలతో రైతు సంఘాలతో రాజకీయ పార్టీల నాయకులతో విద్యార్థి సంఘాలతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే “రాయలసీమ కర్తవ్యం దీక్ష”కు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి పాలకులకు కనువిప్పు కలిగించాలని పిలుపునిచ్చారు..!రాయలసీమ ఖనిజ సంపదలకు “పుట్టినిల్లు” సీమలో అపారమైన ఖనిజ సంపద,విస్తారమైన భూములు,గనులు,నదులు ఉన్నాయి కానీ “అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని”అన్న చందంగా సీమలో కరువు విలయతాండవం చేస్తుంది,ఉపాధి అవకాశాలు లేక ప్రజలు వలసలు పోతున్నారు,ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకు నిరుద్యోగ సమస్య, రైతుల పరిస్థితి దినదిన గండంగా మారింది పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు వెంటాడుతున్నాయి!రాయలసీమలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఖనిజ సంపదలు ఇనుము (ఐరన్ ఓర్) రాతి నారా,నాపరాయి,వజ్రాలు, శేషాచలం కొండలలోని ఎర్రచందనం లాంటి ప్రకృతి సంపదలు నాయకుల కబంధహస్తాలలో దోపిడీకి గురి అవుతున్నాయి!
రాయలసీమ ప్రాంతంలోని మైనింగ్ రంగం ఇతర రాష్ట్రాలలోని వారికి “అక్షయపాత్ర”లా మారింది,సీమ ప్రాంత బిడ్డలకు మాత్రం
“మొండి చేయి” చూపెడుతుంది!రాయలసీమను పట్టిపీడిస్తున్న వెనుకబాటుతనాన్ని,కరువును శాశ్వతంగా రూపుమాపాలంటే సీమకు కావాల్సింది “నీళ్లు,నిధులు, నియామకాలలో సమ న్యాయం అని అన్నారు!రాయలసీమ ప్రాంత అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులను అప్పర్ భద్ర అక్రమ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోమని వినతి పత్రాలు సమర్పించినా “చెవిటోడి ముందు శంఖం” ఊదినట్లు సీమ ప్రాంత అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు వ్యవహరించడం సీమకు ద్రోహం చేయడమే!రాయలసీమ ప్రాంత ప్రజల ఓట్ల కోసం సీట్ల కోసం అధికార,ప్రతిపక్షాలు ప్రాకులాడుతున్నాయే తప్ప కర్ణాటకలో అక్రమంగా నిర్మిస్తున్న “అప్పర్ భద్ర” ప్రాజెక్టు కారణంగా రాయలసీమ “కరువుకు కేరాఫ్ అడ్రస్” గా మారి అంధకారమవుతుందన్న ఆలోచన చేయకపోవడం దుర్మార్గం!సంగమేశ్వరం వద్ద ఐకానిక్ బ్రిడ్జి బదులు “బ్రిడ్జి కం బ్యారేజ్” నిర్మించాలని రాయలసీమ స్టీరింగ్ కమిటీ చేపట్టిన ఉద్యమానికి స్పందించి కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలన చేయడం శుభ పరిణామం అన్నారు! రాయలసీమలో నీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే పెట్టుబడిదారులు పరిశ్రమల నిర్మాణం కోసం క్యూ కడతారన్నారు!రాయలసీమ కర్తవ్య దీక్షలో సీమ ప్రాంత అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు జెండాలు అజెండాలు ప్రక్కన పెట్టి పాల్గొని సీమకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు!ఈ విలేకరుల సమావేశంలో ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు కన్వీనర్ శ్రీకాంత్ ఫాటూరి నరసింహా,గట్టు నవీన్ నాయుడు,వినోద్ యాదవ్, చిన్నా,మహేష్ రెడ్డి,చిన్ని యాదవ్ లు పాల్గొన్నారు